మనో విజ్ఞానశాస్త్ర చారిత్రక ఆధారాలు - Historical Evidances of Psychology


మనోవిజ్ఞానశాస్త్ర చారిత్రక ఆధారాలు
జగత్తు తత్వాన్ని తెలుసుకోవాలనుకున్న భౌతికశాస్త్రవేత్తలు పదార్థాన్ని చిన్నచిన్న పదార్థాలుగా విభజించి పరమాణువులు అన్నారు. దాన్ని విశ్లేషించి భౌతిక పదార్థాల లక్షణాలను తెలుసుకున్నారు. జీవశాస్త్రజ్ఞులు జీవులలోని వివిధ వ్యవస్థలను, వాటిలో కణజాలాలను విభజించి మూలవస్తువును 'కణం' అన్నారు. దాన్ని విశ్లేషించి జీవుల లక్షణాలను తెలుసుకుంటున్నారు,

మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మనస్సును విశ్లేషించి అందులోని భాగాలను భావనలు, సంవేదనలు అన్నారు. వీటిని అధ్యయనం చేయడం ప్రారంభించారు.

'నిన్ను గురించి నీవు తెలుసుకో ' (Know thyself) అనే సూక్తి గ్రీక్ డెల్ఫీ దేవాలయం పై రాసి ఉండటాన్ని చూస్తే మానవుడు తన 'మనస్సు', దాని స్వభావాన్ని గురించి తెలుసు కోవడానికి మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.

ప్రాచీన తత్వవేత్తలు మనస్సు గురించి చర్చించారు. మనస్సును, సంవేదనలను (sensations) స్వీకరించే అంగంగా పరిగణించారు. జగత్తునుంచి వచ్చే సంవేదనలను సమగ్రపరిచే ప్రక్రియను 'బుద్ధి' అనీ, బుద్ధి కంటే ఉన్నతమైంది 'ఆత్మ' అనీ అన్నారు. 'మనస్సు' వాంఛలను, 'బుద్ధి' వాస్తవికతను, 'ఆత్మ' ఆదర్శాన్ని లేదా నీతిని సూచిస్తుందని అన్నారు. మనస్సు, బుద్ధి, ఆత్మ అనే మూడు మానసిక విభాగాలను భారతీయ ప్రాచీన మత సాంప్రదాయం గుర్తించింది. ఇదే రకమైన భావనలు గ్రీక్, ఈజిప్ట్, పారశీ, హెబ్రియా, చైనా మత సాంప్రదాయాలలోనూ కనిపిస్తాయి. ఈ ప్రాచీన కాలంలోనివారు తాము గుర్తించిన విషయాలను శాస్త్రీయ పద్ధతులలో పరిశీలించలేకపోయారు. కాబట్టి అవి నమ్మకాలుగానే మిగిలిపోయాయి. మానవుడికి తన్నుతాను అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వమే కలిగింది. అనేక మంది మేధావుల పరిశోధనలు మనోవిజ్ఞాన శాస్త్రం పై ప్రభావాన్ని చూపించాయి.